పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే!

  • నిమ్మరసం నీళ్లు అందరి ఆరోగ్యానికి సరిపడవు
  • ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారికి మంట ఎక్కువవుతుంది
  • పంటి ఎనామిల్ దెబ్బతినకుండా స్ట్రాతో తాగడం మేలు
  • నోటి పూత, గొంతు నొప్పి ఉన్నప్పుడు దూరంగా ఉండాలి
  • రెగ్యులర్‌గా మందులు వాడేవారు వైద్యుల సలహా తీసుకోవాలి
ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తాగడం ఇప్పుడు పెద్ద హెల్త్ ట్రెండ్‌గా మారింది. రోగనిరోధక శక్తి పెరగడానికి, బరువు తగ్గడానికి చాలామంది దీన్ని ఓ ‘మిరాకిల్ డ్రింక్’లా భావిస్తుంటారు. అయితే నిమ్మరసం నీళ్లు అందరికీ సురక్షితం కాదని కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటమే మంచిదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్ట్రిక్ సమస్యలు
తరచూ ఛాతీలో మంట, ఎసిడిటీ లేదా జీర్ణక్రియ సమస్యలు ఉంటే పరగడుపున నిమ్మరసం తాగడం మంచిది కాదు. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ కడుపులోని పేగుల లైనింగ్‌ను, అన్నవాహికను మరింత ఇరిటేట్‌ చేస్తుంది. దీనివల్ల కడుపునొప్పి, వికారం, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువవుతాయి.

పంటి సమస్యలు
నిమ్మరసంలోని ఎసిడిటీ పంటిపై ఉండే ఎనామిల్ పొరను కాలక్రమేణా కరిగించేస్తుంది. దీనివల్ల పళ్లు పుచ్చిపోవడం, జివ్వున లాగడం వంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ నిమ్మరసం తాగినా నేరుగా పళ్లకు తగలకుండా స్ట్రా (Straw) ఉపయోగించడం, తాగిన వెంటనే మంచి నీటితో నోరు పుక్కిలించడం మంచిది. అయితే నిమ్మరసం తాగిన వెంటనే బ్రష్ చేయొద్దు. ఎందుకంటే ఆ సమయంలో ఎనామిల్ మెత్తగా ఉండి దెబ్బతినే ప్రమాదం ఉంది.

నోటి పూత, గొంతు నొప్పి
నోటిలో పుండ్లు లేదా గొంతు నొప్పితో బాధపడేటప్పుడు నిమ్మరసం తాగితే ఆ ప్రాంతంలో విపరీతమైన మంట పుడుతుంది. ఇది పుండ్లు త్వరగా మానకుండా చేయడమే కాకుండా ఇన్ఫెక్షన్‌ను మరింత ఎక్కువ చేస్తుంది.

మందులు వాడుతున్నప్పుడు
మీరు బీపీ, థైరాయిడ్ లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల కోసం క్రమం తప్పకుండా మందులు వాడుతుంటే నిమ్మరసం తీసుకునే ముందు డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం. నిమ్మరసంలోని కొన్ని సమ్మేళనాలు ఆయా మందులు శరీరంలోకి వెళ్లే విధానాన్ని ప్రభావితం చేస్తాయి.

డీహైడ్రేషన్
నిమ్మరసానికి మూత్రాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఎండల్లో ఎక్కువగా తిరిగే వారు లేదా తీవ్రమైన వ్యాయామాలు చేసేవారు మితిమీరి నిమ్మరసం తాగితే శరీరంలోని లవణాలు, నీటి శాతం తగ్గిపోయి నీరసం, కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.

కొన్ని చిట్కాలు
  • ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మాత్రమే వేసి బాగా పలచగా చేసి తాగాలి.
  • పళ్లను కాపాడుకోవడానికి ఎప్పుడూ స్ట్రాతో తాగడం అలవాటు చేసుకోండి.
  • పరగడుపున కాకుండా బ్రేక్‌ఫాస్ట్ లేదా భోజనంతో పాటు తీసుకోవడం మంచిది.
  • నిమ్మ తొక్కలో ‘ఆక్సలేట్లు’ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీలో రాళ్లు ఉన్నవారు నిమ్మ తొక్కతో కూడిన ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగకపోవడం ఉత్తమం.

Lemon Juice
Lemon water
acidity
gastric problems
tooth enamel
oral health
dehydration
health risks
health tips

More Telugu News